మనం నథింగ్ అనుకుంటేనే సంథింగ్... మనం సంథింగ్ అనుకుంటే నథింగ్

Tuesday 20 December 2011

మన సం'క్రాంతి'

పండుగ... ఈ పదానికి ఉన్న వైశిష్ట్యమే వేరు. మన సంస్కృతీసంప్రదాయాలకు పండుగలే పట్టుకొమ్మలు. ఇవి వేదాలు మనకు ప్రసాదించిన మహాప్రసాదం. ప్రతి పండుగ వెనకా ఓ అర్థం పరమార్థం దాగి ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ఈ పండుగలు విప్పిచెబుతున్నాయి. అలాంటి పండుగల్లో మకర సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పల్లెపట్టులు సంక్రాంతి శోభతో అలరారుతుంటాయి. మానవాళికి జ్ఞానకాంతులిచ్చే పెద్దపండుగ సంక్రాంతి. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వెలుగులను మనం ఆస్వాదించి తీరాల్సిందే. మన పండుగలన్నీ 'కాలం' ప్రసాదించినవే. మరి ఈ సంక్రాంతికీ కాలానికీ ఉన్న సంబంధం ఎలాంటిది? ఇందులో దాగిఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈ పండుగను మనం ఎలా జరుపుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.
సంక్రమణం
సంక్రమణం అంటే కలయిక. నవగ్రహాల్లో ప్రతి గ్రహానికీ సంక్రమణం ఉంటుంది. అంటే ఆ గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్లటమన్నమాట. కానీ ఈ మాటను అన్ని గ్రహాలకు వాడరు. ఒక్క సూర్యుడికి మాత్రమే ప్రధానంగా చూస్తారు. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటాడు. ఆ రాశి నుంచి ఇంకో రాశికి మారటాన్నే సంక్రమణంగా పేర్కొంటారు. మన పంచాంగాల్లో ప్రతి నెలా మాస సంక్రమణం ఉంటుంది. అయితే మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత ఉంది. మకర సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజన్నమాట. ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకునేముందు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
కాలచక్రం-మకరం
మనకున్న కాలమానాన్ని వేదమే అందించింది. అందుకే మనకు వేదమే ఆది. ఆ వేదాల ఆధారంగానే కాలం, దాంతో పాటే పంచాంగం ఆవిర్భవించాయి. అనంత జ్ఞానభాండాగారమంతా ఈ 'ఆది'లోనే ఉంది. కాలమే మన పంచాంగాలకూ, హిందూ క్యాలెండర్‌కూ మూలస్తంభం. ఈ కాలానుగుణంగానే మనకు పండుగలు వస్తున్నాయి. మన కాలానికి ఆత్మ సూర్యుడు. మన కాలం అని ఎందుకంటున్నామంటే ఈ అనంత విశ్వంలో అనేక మంది సూర్యులు ఉండ వచ్చు. అలాగే అనేగ భూగ్రహాలూ ఉండవచ్చు. మన భూమి ఈ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టే మనకు రేయింబవళ్లు ఏర్పడుతున్నాయి. అందుకే మన కాలానికి ఆత్మగా సూర్యుడిని చెబుతున్నారు. కాలచక్రాన్ని 12 రాశులుగా విభజించారు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. మేషాది 12 రాశుల్లో పదోది అయిన మకరాన్ని కర్మ స్థానంగా పేర్కొంటారు. సూర్యుడు దక్షిణ దిక్కుగా పయనిస్తే దక్షిణాయణం అని, ఉత్తర దిక్కుగా పయనిస్తే ఉత్తరాయణం అని అంటారు.సూర్యుడు ఈ మకర రాశిలో అడుగుపెట్టడంతోనే ఉత్తర దిక్కు ప్రయాణం మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టే సమయాన్నే మకర సంక్రమణం అంటారు. అదే మన మకర సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే మంచి స్థానంలోకి ప్రయాణం. మరి మకరం మంచి స్థానం ఎలా అయిందనే సందేహం కూడా కలుగుతుంది. అదేమిటో తెలుసుకుందాం.
జీవులను పరలోకానికి తీసుకుపోయే రాజద్వారం మకరరాశి. విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణం ఈ రాశికి చెందినదే. ఇంకో విశేషమేమిటంటే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. దీన్నిబట్టి చూస్తే శనీశ్వరుడికి ఎంత విశిష్టస్థానముందో అర్థమవుతుంది. మనిషిలో దాగిఉన్న మహత్తర శక్తులను బహిర్గతం చెయ్యడంలోనూ, ఇహలోకపరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలోనూ శని సిద్ధహస్తుడు. సూర్యుడి తేజస్సు అభివృద్ధిచెందే రాశి ఇదే కాబట్టి మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత ఉంది. జీవుడు, దేవుడు కలిసే యోగభూమిగా మకరరాశిని పేర్కొంటారు. జీవుడు ఇహలోక యాత్రను చాలించి పరలోక ప్రయాణానికి మకరరాశి సంకేతం. ఈ రాశి నుంచి ఆరు రాశులు దాటిన తర్వాత మళ్లీ ఇహలోకానికి చేరే కర్కాటక రాశి ఉంది. అందువల్ల మకరం నుంచి కర్కాటకం వరకూ ఉండే రాశుల కూటమిని మకర తోరణం అంటారు. మేషం నుంచి మకరం స్ధానం పది. సంఖ్యాశాస్త్రం పరంగా చూస్తే ఒకటి ఆదికీ, సున్నా అనంతానికీ ప్రతీకలు. అనంతమైన వస్తువుకు ఆది తోడైతేనేగాని భౌతిక జగత్తు స్వరూపం అర్థంకాదు. ఇక మకర రాశి అధిపతి శని సంఖ్య ఎనిమిది. రెండు సున్నాలు కలిస్తే ఎనిమిది ఏర్పడుతుంది. అనంతాలైన జీవాత్మ, పరమాత్మల కలయిక ఈ సంఖ్య. అందరూ అనుకున్నట్లు శనీశ్వరుడు బాధలు పెట్టేవాడే కాదు అనంతతత్వాన్ని అర్థమయ్యేలా చేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించేవాడు కూడా. మరి మకర సంక్రమణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
మకర సంక్రమణంతో కాలపురుషుడు మేల్కొంటాడు. ఈ పుణ్యకాలంలో చేసిన పూజ, జపం, తపస్సు, ధ్యానం, దానాలు అనంత ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. జీవి పుట్టడం, పెరగడం, మరణించడం (సృష్టి, స్థితి, లయ) కాలంవల్లే జరుగుతోంది.  కాలానికి ఆత్మ సూర్యుడే కాబట్టి ఆయన ఉత్తర దిక్కు ప్రయాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ దిక్కులో ఉన్న సప్తర్షి మండలం, ధ్రువ మండలం, విష్ణు పురాలను ఆయన సందర్శిస్తాడు. అందువల్ల ఇది అపూర్వమైన మోక్షకాలం. అందువల్ల ఈ సమయంలో చేసే ఎలాంటి కర్మ అయినా అనంత ఫలితాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికోన్నతిని సాధించాలంటే ఇంతకంటే అనువైన సమయం మరొకటి లేదు. ఈ సంక్రమణ కాలంలో పూజ, జప, ధ్యానాలు చేసేవారికి కాలపురుషుడి సహాయం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండానికీ, పిండాండానికీ తేడా ఏమీలేదు కాబట్టి. అణువు లోపల న్యూక్లియస్‌ ఉండి దాని చుట్టూ పరమాణువులు తిరిగే మాదిరిగానే ఈ బ్రహ్మాండంలో సూర్యుడు మధ్యలో ఉండి దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి.
యోగశాస్త్రం పరంగా...
'యజ్ఞః సంవత్సరః' అంటోంది వేదం. సంవత్సరమే యజ్ఞ స్వరూపమని దీని భావం. అంతేకాదు మన శరీరంలో ప్రాణసంచారంవల్ల ఎలా యజ్ఞం జరుగుతుందో తెలుసుకోమని 'ప్రాణో యజ్ఞేన కల్పతాం' అని కూడా వేదం ఉపదేశించింది. శరీరంలో జరిగే కాలగమనం యోగికి మాత్రమే తెలుస్తుంది. శరీరంలో ప్రాణమే సూర్యుడు. ఈ ప్రాణ సంచారమే కాలచక్రంలోని రవి సంచారం.శరీరంలో తలపైన సహస్రార చక్రం ఉంటుంది. అందుకే శిరస్సును మోక్షస్థానం అంటారు. సమాధిస్థితిలో ఈ సహస్రారంలో ఉండే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని అందులో నుంచి జీవుడు బయటకు వెళ్లగలిగితే అతడికి జన్మరాహిత్యం కలుగుతుంది. ఈ మోక్ష మార్గమే ఉత్తర మార్గం. దీపారాధనలో ఉన్న నెయ్యి పైకి ఎగబాకినట్లుగా మన శరీరంలో ఉన్న ప్రాణాన్ని పైకి తెచ్చే విద్యే యోగాభ్యాసం.మనలోని దుర్గుణాలను తగ్గించుకోవడానికి ఈ ఉత్తరాయణ కాలం అనుకూల సమయం. జనవరి 14 నుంచి జులై 14 దాకా ప్రపంచంలోని అన్ని వస్తువులూ కింది నుంచి పైకి ప్రవహించే సమయం. ఆవిరై పైకి వెళ్లిన నీరు జులై తర్వాత ఆరుమాసాలపాటు కిందికి వర్షిస్తుంది. దక్షిణాయణంలో కాలపురుషుడు ధ్యానస్థితిలో ఉంటాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన మేల్కొంటాడు. ఈ ఉత్తరాయణంలో వైకుంఠద్వారం తెరిచి ఉంటుందని వేదం చెబుతోంది. విష్ణు లోకానికి చేరువయ్యే కాలం కూడా ఇదే. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహాన్ని విడిచాడు. మోక్షాధికారి విష్ణుమూర్తే కదా. ఉర్ధ్వలోకాలకు వెళ్లేవారు సప్తర్షి మండలం, ధ్రువ మండలం, సూర్యమండలం దాటి విష్ణులోకానికి వెళతారు. ఈ జీవుడు మళ్లీ తిరిగి వెనక్కి రాడు.
కాలపురుషుడి సూక్ష్మశరీరమే జీవుడు. ఈ జీవుడు యోగసమాధిలోకి వెళితే కాలపురుషుడే అవుతాడు. జీవుడికి మూలాధార చక్రంలో ఉండే కుండలిని శక్తిని ఆదిశేషుడికి గుర్తుగా పేర్కొంటారు. ఈ కుండలిని సుషుమ్మ నాడి గుండా ఒక్కో చక్రాన్నీ దాటుకుంటూ సహస్రారాన్ని చేరుకుంటే సమాధి స్థితి ఏర్పడుతుంది. కాలపురుషుడు కూడా దక్షిణాయణంలో సమాధిలోనే ఉంటాడు. ఇది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని కర్కాటక సంక్రమణం అంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు స్వామి సమాధిలోకి వెళ్లిపోతాడు. వెంటనే ఆ స్వామిని జగద్గురుమూర్తిగా ఆరాధించే గురుపూర్ణిమ వస్తుంది. ఆషాఢం నుంచి కార్తికం వరకూ ఆ స్వామిని ఆరాధించేందుకే పండుగలు వస్తున్నాయి. తొలి ఏకాదశి, గురుపూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణజన్మాష్టమి, వినాయక చవితితోపాటు స్వామిని జగన్మాత స్వరూపంగా ఆరాధించేందుకు నవరాత్రులు వస్తాయి. మనలోని అరిషడ్వార్గాలను జయంచడానికి దీపావళి వస్తుంది. కుండలిని శక్తిరూపుడైన ఆదిశేషుడిని పూజించటానికి నాగులచవితి వస్తుంది. క్షీరాబ్ధిశయన ఏకాదశి, పూర్ణిమల వరకూ స్వామి సమాధిలోనే ఉంటాడు. మానవుడికి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రిలాగా కాలపురుషుడికి ఆరు నెలలు పగలు, మరో ఆరు నెలలు రాత్రి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి వెళ్లటంతోనే స్వామికి మెలకువ వస్తుంది. భక్తులు ఆయనకు మేలుకొలుపులు పాడే సమయమది. సంక్రాంతి పండుగ నెల వాతావరణం ధనుర్మాసంలోనే వచ్చేస్తుంది. కళ్లాపులు చల్లి రంగురంగుల ముగ్గులువేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పండుగ శోభను తీసుకువస్తారు.
సంక్రాంతి వైశిష్ట్యం
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలమే సంక్రాంతి. సాధారణంగా ఇది పుష్యమాసంలోనే వస్తుంది. నెల ముందు నుంచే సంక్రాంతి శోభ వచ్చినా మూడు రోజులపాటు ఈ పర్వదినాన్ని జరుపుతాం. అవే భోగి, సంక్రాంతి, కనుమ. ఈ మూడు రోజుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. భోగి అంటే సకల భోగాలూ ఇచ్చేది అని అర్థం. భోగాలను కోరేవారు అగ్నిని పూజించాలంటోంది వేదం. భోగిరోజున ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు. 'పాత' అంతటినీ తగలేసే యజ్ఞకుండమే ఈ భోగిమంట. మనిషిలోని చెడును దగ్ధం చేయాలనేది ఈ భోగిమంటల అంతరార్థం. వాటిని దగ్ధం చేస్తే సకల భోగాలూ లభిస్తాయనేది పరమార్థం. చిన్నపిల్లలకు ఈ రోజున తలపై భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లనే భోగిపళ్లు అంటారు. భోగభాగ్యాలు కలగాలని దీవిస్తూ ఇలా భోగిపళ్లు పోస్తారు. రేగు వృక్షాన్ని బదరీ వృక్షం అంటారు. ఆ వనంలో నరనారాయణులు తపస్సు చేసి బదరికి ఆ పవిత్ర వచ్చేలా చేశారు. ఇక సంక్రాంతినాడు చేయాల్సిన విధులు మూడు. అవి 1 దానం, 2 స్నానం, 3 పూజ. సూర్యోదయానికి ముందే నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి తలంటి స్నానం చేయాలి. శనగలు, పటికబెల్లం, నువ్వులూ బెల్లం కలిపి దంచిన చిమ్మిలి ఉండలను పేరంటాళ్లకు పంచిపెడతారు. ఈ ఆచారానికి అర్థం గ్రహశాంతి చేయడమే. జాతకంలో శనివల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. అలా చేస్తే చాలా మంది భయపడి తీసుకోరు. అందుకే ఇలా చిమ్మిలి తయారు చేస్తారు. తిలాపాపం తలాపిడికెడు అనే సామెత దీనివల్లే వచ్చింది. ఇక ఆయుర్వేద శాస్త్రపరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచిని చేస్తాయి. శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. పాయసదానం, కాంస్యపాత్ర దానం, సువర్ణలింగ దానం చాలా మంచిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలను బంగారంతోగానీ, వెండితోగానీ, కంచుతోగానీ చేసినవి దానమివ్వటంవల్ల సమస్త పృధ్వినీ దానం చేసినంత ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
ఈ సంక్రాంతికి ఏంచేయాలి?
సంక్రాంతి ముగ్గు
2012 శ్రీ ఖరనామ సంవత్సరం. పుష్యమాసం బహుళ షష్ఠి శనివారం 14వ తేదీ ఉత్తరా నక్షత్రం, తులా లగ్నంలో రాత్రి 1.10 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి సూర్యోదయమైన 15వ తేదీ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి పురుషుడి విశేషాలను మరో వ్యాసంలో వివరిస్తాను. ఈ సంక్రాంతి రోజైన ఆదివారం పితృదేవలను తృప్తిపరచటానికి మీ శక్తి కొద్దీ దానం చేస్తే మంచిది. బంగారం, వెండి, భూమి, ధాన్యం, వస్త్రం, గుమ్మడికాయ దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వామనావతారంలో వామనుడికి బలి మూడడుగుల నేలను దానం చేసింది ఈ పండుగనాడే. తన మూడో పాదాన్ని బలి శిరస్సున మోపి అతడిని పాతాళానికి పంపంది కూడా సంక్రాంతి రోజునే. ఈ రోజున బలి చక్రవర్తికి కూష్మాండ దానం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. అందుకే బ్రహ్మాండానికి ప్రతీకగా గుమ్మడికాయను దానం చేస్తుంటారు. పితృదేవతల ప్రీతికోసం తిల తర్పణాలు కూడా చేస్తారు. మకర రాశికి చెందిన శ్రవణా నక్షత్రంలోనే శ్రీవేంకటేశ్వరుడు అవతరించి ఈ రాశికి గుర్తుగా మకర కుండలాలను ధరించాడు. సంక్రాంతి మూడోరోజున చేసే కనుమ ప్రధానంగా వ్యవసాయదారులకు ఉద్దేశించినది. మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఇది పండుగేనని నిరూపించేదే ఈ కనుమ. కొందరు పశువులను అలంకరిస్తే, మరికొందరు గ్రామ పొలిమేరల చుట్టూ, పొలాల చుట్టూ 'పొలి'వేస్తారు.భూతప్రేతాలు తమ పంటలు పాడుచేయరాదన్న భావంతోనే పొలి ఆచారం వచ్చింది. కొందరు జంతు బలులతో  ఈ పొలి ఆచారాన్ని పాటిస్తున్నారు. కనుమనాడు ఎవ్వరూ ప్రయాణం చేయరు. కనుమనాడు కాకి కూడా కదలదని సామెత కూడా ఉంది. కనుమ తర్వాత 'ముక్కనుమ' కూడా చేస్తారు. పండుగ అనేది పుణ్యకార్యాలు చేయటానికేగానీ పాప కార్యాలు చేయడానికి కాదు. మన ఆచారాలను అర్థం చేసుకోవడంలో వచ్చిన తేడాయేగానీ వాటి ఆంతరార్థం వేరు. మనిషి ఏ దారిలో వెళ్లినా అతడ్ని తన దారికి ఎలా తెచ్చుకోవాలో ఆ కాలపురుషుడికి బాగా తెలుసు. అందుకే ఆయన అనంతుడు. ఆది, అంతం మధ్యలో ఉండేదే అనంతం. ఆ అనంతతత్వాన్ని తెలుసుకోగలిగితే ఇక ఆదీ లేదు అంతమూ లేదు. ఈ అనంతకాల గమనంలో అందరూ ఆయనకే చెందుతారు. ఆ గమ్యాన్ని చేరుకునేందుకే ఈ సంక్రాంతి. 

Thursday 11 August 2011

భవిష్య దర్శనం!

 ఓంకారమే  వేదం  సర్వమ్  అన్నారు.  అక్షరానికి ఆది ఓంకారమే. ఇక వేదం గురించి చెప్పాల్సివస్తే  విద్ అనే ధాతువు నుంచి వచ్చిన పదమే వేదం. విద్ అన్నా,  విద్య అన్నా జ్ఞానమే. ఈ జ్ఞానానికి మూలాధారం అక్షరం.  

క్షరం (నాశనం) కానిది అక్షరం. కాలానికి అనుగుణంగా ‘కలం’ మారుతోంది.
మన జ్ఞాన భాండాగారాన్ని ఆధునిక అక్షరంగా మలిచి అరటిపండు ఒలిచినట్టుగా విప్పి చెప్పాలన్నదే మా తపన. 

అక్షర సాగరాన్ని మధించి జ్ఞానామృతాన్ని మీకందించటమే మా లక్ష్యం. అందుకే ఈ ప్రయత్నం!

మాలిక: Telugu Blogs